హిందీలో అవకాశాలు లేనివారే సౌత్ వైపు వెళతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది: సమీరారెడ్డి

  • తనను దక్షిణాది సినిమాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారన్న సమీరారెడ్డి
  • దక్షిణాది స్టార్లతో పనిచేయడం తన తండ్రికి గర్వకారణమని వెల్లడి
  • ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారలు సౌత్ సినిమాల కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్య

దక్షిణాది సినిమాలపై తనకున్న గౌరవాన్ని సినీ నటి సమీరారెడ్డి మరోసారి చాటుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో నాటి అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు. సమీరారెడ్డి కెరీర్ మొదట్లో హిందీ సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు, ఆమె టీమ్ సభ్యులు దక్షిణాది సినిమాల వైపు వెళ్లొద్దని హెచ్చరించారట. "హిందీలో అవకాశాలు లేని వారే సౌత్ వైపు వెళతారు" అనే తప్పుడు అభిప్రాయం అప్పట్లో ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు. 


కానీ, ఒక సౌత్ ఇండియన్ అమ్మాయిగా తన మూలాలను గౌరవిస్తూ, ఆ మాటలను పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ల సరసన నటించడానికి ఆమె సిద్ధపడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య, అజిత్ వంటి దిగ్గజాలతో పనిచేయడం తన కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రికి గర్వకారణమని ఆమె సగర్వంగా చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సౌత్ సినిమాల కోసం పోటీ పడుతున్న విషయాన్ని సమీరా గుర్తు చేశారు. దక్షిణాది దర్శకులు కొత్త ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, అందుకే ఇక్కడి సినిమాలు సాంకేతికంగా, యాక్షన్ పరంగా ఎప్పుడూ ముందంజలో ఉంటాయని ఆమె విశ్లేషించారు. హిందీ మేకర్స్ తరచుగా 'సేఫ్ జోన్'లో ఉండాలని చూస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.


దాదాపు దశాబ్ద కాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న సమీరా, ఇప్పుడు సంజయ్ దత్ సరసన ‘ఆఖరి సవాల్’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇది తన కమ్ బ్యాక్ కాదని, కేవలం ఒక చిన్న విరామం తర్వాత చేస్తున్న ప్రయాణమని ఆమె స్పష్టం చేశారు.


Sameera Reddy
South Indian cinema
Bollywood
Junior NTR
Chiranjeevi
Tollywood
Kollywood
Hindi movies
Akhri Savaal

More Telugu News